Description
గృహస్థుడైన వ్యక్తికి విధింప బడిన నిత్య కర్మలను గూర్చి శాస్త్రముల యందు చెప్పబడి నట్లుగా నిరూపింప బడును. ఇట్టి నిత్య కర్మలను యథావిధిగా శ్రద్దతో ఆచరించిన వ్యక్తి దేవ సంబంధమైన, పితృ సంబంధమైన, మనుష్య సంబంధమైన త్రివిధ రూపములగు ఋణముల నుండి విముక్తు డగును.
‘జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ ఋణవాన్ జాయతే’ (తై. సం. 6-3-10-5) అనగా పుట్టిన ప్రతి వ్యక్తి తన జన్మతో బాటు త్రివిధ ఋణములతో జన్మించును. అట్టి ఋణములను తీర్చుకొనుటకై శాస్త్రములు నిత్య కర్మలను విధించినవి. నిత్య కర్మలలో శారీరక శుద్ధి అనగా స్నానము, సంధ్యా వందనము, తర్పణము, దేవ పూజనము మొదలగు శాస్త్ర నిర్దిష్టమగు కర్మలు పేర్కొన బడినవి. ఇందులో ముఖ్యంగా ఆరు విధములైన షట్ కర్మలు చెప్పబడినవి.
సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాం చ పూజనమ్।
వైశ్వదేవం తథాఽఽతిథ్యం షట్‌కర్మాణి దినే దినే॥
(బృహత్ పరాశర స్మృతి. 1 / 39)
(ఇచ్చట ‘స్నాన’ శబ్దము స్నాన పూర్వకముగా అన్ని కార్యములను చేయవలెను అనెడు ఉప లక్షక రూపములో నిర్దిష్టము చేయు చున్నది. “పాఠక్రమాదర్థక్రమో బలీయాన్” అను సూత్రమును అనుసరింఛి ముందుగా స్నానము తదుపరి సంధ్యా అని గ్రహింప వలెను.)
సంధ్యాస్నానం జపో హోమో దేవతానాం చ పూజనమ్।
ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే॥
(పరాశర స్మృతి. 1/39)
ప్రతి దినము స్నానము చేయవలెను. తర్వాత సంధ్యా వందనము ఆచరించుట, జపము. (బ్రహ్మ యజ్ఞము) చేయుట, నిత్యాగ్ని హోత్రమును ఆచరించుట, దేవతా పూజను, బలి వైశ్వదేవమును నిర్వహించుట, అతిథి పూజనము చేయుట అనునవి షట్కర్మలు. వీటిని ప్రతి నిత్యము ఆచరింప వలెను.
Reviews
There are no reviews yet.